Dayle Breaking News

నరసం ఉగాది కవితల పోటీ విజేతలు.

ఓటరు చైతన్యానికై కవితల పోటీ

1 272

ఒంగోలు::

        

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటరులలో చైతన్యం కల్పించుటకు సాహిత్యమును ఒక మార్గసూచిగ చేసుకొని    నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం(నరసం ) మహిళలకు మాత్రమే కవితల పోటీలను నిర్వహించారు. పోటీలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవయిత్రులు పెద్ద సంఖ్యలో తమ కవితలను వాట్సప్ ద్వారా పంపారు. వచ్చిన కవితలలో మేటిగా ఉన్న రచనలను శోధించి విజేతలను సంస్థ గౌరవాధ్యక్షురాలు తేళ్ళ అరుణ మంగళవారం ప్రకటించారు. 

విజేతలు వరుసగా ప్రథమ బహుమతిని హైదరాబాద్, కోకాపేటకు చెందిన రోహిణి వంజారి రచించిన “మరవబోకు” కవితకు, ద్వితీయ బహుమతి పశ్చిమ గోదావరి, పాలకొల్లుకు చెందిన వై శ్రీదేవి “ఓటరై గెలువు” అన్న కవితకు, తృతీయ బహుమతి తెలంగాణ, నిజామాబాద్ బి.కళాగోపాల్ రచించిన “ఇక్కడ ఓట్లు అమ్ముడుబోవు” అన్న కవితలను ఎంపిక చేసినట్లు తూలిపారు. ప్రోత్సాహక బహుమతులను “ఒక్కడిగా” చిత్తూరు జిల్లా సంధ్యాశర్మ, “నేను సైతం ఓటు వేస్తా” కర్నూలు జిల్లా కే.కవితా దేవి లు వశం చేసుకొన్నారని వివరించారు.

ఈ సందర్భంగా విజేతలందరకు న ర సం అధ్యక్షురాలు  చిన్నలక్ష్మి కళావతి, ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, ఉపాధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి, దండెబోయిన పార్వతి, సింహాద్రి జ్యోతిర్మయి లు అభినందనలు తెలియజేశారు.

ప్రధమ బహుమతి పొందిన రోహిణి వంజారి “మరువబోకు” కవిత.

అది- ఒక కసాయి కత్తిలాగా

కోడినో, మేకనో కోయడానికి వాడేది అనుకున్నావా?

బాబూ.. అమ్మా.. నీ చేతిలో ఉన్నది బ్రహ్మాస్త్రం!

అనుచితంగా సంధిస్తే.. జరిగేది, అవశ్యం ఆత్మహననం!

అది- ఒక వ్యర్థజనిత పదార్థం లాగా

తాక నొల్లనిది, నువు పరిగణించదలచినది కాదనుకున్నావా?

ఆ ‘బూతు’ల్లోకి ప్రవేశమే నీ స్థాయికి తగదంటావా?

ఆ ధూర్తుల కోసం నీ వేలికి సిరా మరక, ఎందుకు దండగంటావా?

ఆ సెలవు దినాన కాలు కదపకుండా సేదతీరుతున్నావా?

మిత్రమా.. నీ నిర్లిప్తత.. అతిపెద్ద ధూర్తత!

నీ నిర్లక్ష్యం సంఘహితానికి పెనుశాపం!!

అది- ఈ దేశపు రాజ్యాంగం నీకిచ్చిన సర్వోన్నతమైన హక్కు..

విస్మరించబోకు! కర్తవ్యం మరవబోకు!

మిత్రమా.. 

ధూర్తులు, దుర్మార్గులు గద్దెనెక్కి రాజ్యమేలితే

ఆ పాపభారం మోయాల్సింది నువ్వే..

పరిహారానికి మహారౌరవాది అష్టవింశతి నరకాలూ  చాలవు..

కొత్త నరకాల సృష్టి జరగాలి.. ఎందుకంత శ్రమపడతావు?

గుర్తించు.. ముందే మేల్కాంచు..

అలసత్వానికి పాతర వేసేసి కదులు..

ప్రలోభాలను తోసిరాజంటూ కదులు..

సమాజ హితమును కాంక్షించే సంకల్ప సంజాతం నువ్వు!

జనావళి సుగతుల లక్ష్యించే బ్రహ్మాస్త్ర సమన్వితం నువ్వు!!

వృథా కానివ్వక నీ ఓటును, విలువ ఎరిగి సంధించు!

1 Comment
  1. Ramana says

    Excellent

Leave A Reply

Your email address will not be published.